శ్రీసత్యసాయి జిల్లాలో అద్భుతం జరిగింది. సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము చుట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. పుట్టపర్తి పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఉన్న ఆర్గ్సంగ్ విల్లాస్ గృహ సముదాయంలో సోమవారం ఈ దృశ్యం కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఒకరోజు ఆలస్యంగా బయటపడింది. అమెరికాకు చెందిన ప్యాటీ కైన్మెన్ అనే భక్తురాలు సాయిబాబా విగ్రహాలతో మందిరాన్ని నిర్మించింది. నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. ఇంతలో అనుకోకుండా ఒక పెద్ద నాగుపాము తన ఇంటిలో దేవుడి మందిరంలోకి వచ్చింది. సత్యసాయి బాబా విగ్రహం మెడకు చుట్టుకుని విగ్రహాన్ని ముద్దాడుతూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె ఈ విషయాన్ని గమనించారు. ఆమె ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు.. వెంటనే ఇరుగుపొరుగున ఉంటున్నవారిని పిలిచి విషయం చెప్పింది. అందరూ అక్కడకు చేరుకుని నాగుపాముకు పాలు, నీళ్లు తాపి.. పసుపు, కుంకుమ, పూలు చల్లుతూ పూజలు చేశారు. నాగుపాము కొన్ని గంటల పాటు విగ్రహాన్ని చుట్టుకుని పడగవిప్పి ఆరాధిస్తున్నట్లుగా అక్కడే ఉండి పోయింది. ఈ దృశ్యాన్ని చూడటానికి భక్తులు ఎగబడ్డారు. నిజంగా ఈ ఘటన దేవుడి మహిమ అంటున్నారు.