ఎన్టీఆర్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. మూడో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదేళ్ల చిన్నారిని కన్నతండ్రి చిత్రహింసలు పెట్టాడు తండ్రి. అతడికి తల్లి కూడా సహకరించింది. గౌరవరం గ్రామానికి చెందిన నక్కల ప్రవీణ్, అతడి తల్లి గోవర్థనమ్మ ఆరు నెలల నుంచి జగ్గయ్యపేటలోని నాగమయ్యబజార్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.. అతడు కార్పెంటర్ పనిచేస్తుంటాడు. ప్రవీణ్‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా.. అతడి ప్రవర్తనతో వేగలేక భార్య ఏడాదికే విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత ఏడాదికి నందిగామకు చెందిన తిరుపతమ్మ అనే మహిళను ప్రవీణ్ రెండో వివాహం చేసుకుని జగ్గయ్యపేట ధనంబోడులో కాపురం పెట్టాడు. వారికి లోహిత అనే పాప జన్మించింది.. నాలుగేళ్ల క్రితం తిరుపతమ్మ అనుమానాస్పద స్థితిలో చనిపోగా.. ప్రవీణ్ హతమార్చాడనే అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ప్రవీణ్ మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే తన కూతురు లోహిత అడ్డుగా ఉందని ప్రవీణ్, అతడి తల్లి గోవర్ధనమ్మ కొద్ది రోజులు ఆ చిన్నారిని పట్టణంలోని బంధువుల దగ్గరకు పంపించారు.
బంధువులు ఈ మధ్యే ఆ బాలికను తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు. అప్పటి నుంచి లోహితకు సరిగా తిండి పెట్టకుండా టార్చర్ చేశారు. ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తున్నారు.. ఈ క్రమంలో బాలిక తలకు తీవ్ర గాయమైంది. వీపు మొత్తం గాయాలతో కమిలిపోయింది. పాపం బాలికను చీరతో కట్టేయటంతో స్థానికులకు ఆమె అరుపులు వినిపించాయి.. వారు అంగన్‌వాడీ ఆయా జరీనాకు సమాచారం అందించారు. ఆమె నాలుగు రోజుల క్రితం ఫోటోలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించింది.
అధికారులు ఆ బాలికకు తండ్రి నుంచి విముక్తి కల్పించారు. తొలుత బాలిక తమ దగ్గర లేదని చెప్పేందుకు ప్రవీణ్, గోవర్ధనమ్మ ప్రయత్నించారు. వచ్చిన అధికారులపైఎదురుదాడికి కూడా దిగారు. ఎట్టకేలకు స్థానికులు, పోలీసుల సహకారంతో ఇల్లు మొత్తం సోదా చేయగా బాత్‌రూంలో బాలికను బకెట్‌లో దాచి.. పైన బట్టలు కప్పి ఉంచిన విషయం బయటపడింది. ప్రవీణ్, గోవర్ధనమ్మలను పోలీసులు అరెస్ట్ చేశారు.. బాలికను రక్షించారు. అంగన్‌వాడీ ఆయా చొరవతో లోహిత ఆ నరకం నుంచి బయటపడింది. మూడో పెళ్లి చేసుకోవడం కోసం చిన్నారి అడ్డుగా ఉందని భావించే తండ్రి ముందు ఆమెను బంధువుల ఇంటికి పంపించాడు.. కానీ మళ్లీ పాపను వెనక్కు తీసుకురావడంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపించాడు. పాపం సరైన తిండ లేక, తండ్రి చిత్రహింసలు తట్టుకోలేకపోయింది ఆ పసిప్రాణం.