సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు ఈ కాలంలో అందరి నోళ్లలో నానుతున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). కంప్యూటర్ రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు, నిత్య జీవితంలో ఉపయోగించే ఎన్నో పరికరాలు ‘స్మార్ట్’గా మారడం వెనుకున్న అదృశ్య హస్తమిదే. అన్ని రంగాలపైనా ఇది ప్రభావం చూపుతోంది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఏఐ సాయంతో మొదటిసారి అనువదించారు. ప్రధాని ఆదివారం తన నియోజకవర్గం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. ఈ సమయంలో ప్రదాని ప్రసంగాన్ని కృత్రిమ మేధ సాయంతో ట్రాన్స్‌లేట్ చేయడం విశేషం.
ప్రధాని మాట్లాడుతూ.. సాంకేతికత మరింత మందికి చేరువ కావడానికి దోహదపడుతుందని అన్నారు. ‘ఇది నా మొదటి అనుభవం.. నేను ఎప్పటిలాగే హిందీలో మాట్లాడతాను.. AI దానిని తమిళంలోకి అనువదిస్తుంది’ అని కాశీ తమిళ సంగమం వద్ద ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. ఇది ఒక కొత్త ఆరంభం.. ఆశాజనకం.. నేను మిమ్మల్ని చేరుకోవడం సులభతరం చేస్తుంది’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాని ప్రసంగాన్ని ఏఐ ఆధారిత అనువాద సాధనం ‘భాషిణి’ ద్వారా అనువదించారు. ‘భాషిణి’ అనేది కృత్రిమ మేధకు సంబంధించిన భాషా అనువాద వ్యవస్థ, ఇది ఇతర భారతీయ భాషలు మాట్లాడే వారితో మాట్లాడేటప్పుడు వారి స్వంత భాషలో మాట్లాడటానికి వీలు కల్పిస్తుంది. తమిళనాడు, వారణాసి మధ్య బంధాన్ని ‘అద్వితీయం’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘తమిళనాడు నుంచి కాశీకి రావడం అంటే మహాదేవుని ఒక ఇంటి నుంచి మరో ఇంటికి రావడం.. మీ అందరికీ సేవ చేయడంలో కాశీ ప్రజలు ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు బాబా విశ్వనాథ్ ఆశీర్వాదంతో పాటు మీరు కాశీ సంస్కృతి, జ్ఞాపకాలను, రుచులను కూడా మీతో తీసుకువెళతారు’’ అని మోదీ అన్నారు.
కన్యాకుమారి- వారణాసి తమిళ సంగమం రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుక్కురల్, మణిమేకలై, ఇతర ప్రముఖ తమిళ సాహిత్యం, బహుళ భాష, బ్రెయిలీ అనువాదాలను కూడా మోదీ ఆవిష్కరించారు. అలాగే, ఎగ్జిబిషన్‌ను తిలకించి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కాగా, నెల రోజుల పాటు సాగు కాశీ-తమిళ సంగమంలో తమిళనాడు, పుదుచ్చేరిలకు చెందిన 1,400 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలతో పాటు తమిళనాడు, వారణాసికి చెందిన కళ, సంగీతం, చేనేత, హస్తకళలు, వంటకాలు, ఇతర విలక్షణమైన ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు.