రెసిడెన్సియల్ స్కూల్‌లో దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయించిన దారుణ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు శిక్షగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఈ పని చేయించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఇందుకు బాధ్యులైనవారి పోలీసులు అరెస్టు చేయగా.. నలుగురు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. కోలార్ జిల్లాలోని మొరార్జీ దేశాయ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
6 నుంచి 9 తరగతుల వరకూ ఉన్న ఈ పాఠశాలో 19 మంది బాలికల సహా మొత్తం 243 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, నలుగురు విద్యార్థులను సెప్టిక్ ట్యాంకులోకి దింపి శుభ్రం చేయించిన విషయం బయటకు వచ్చింది. అలాగే, ఇదే స్కూల్‌కు సంబంధించి మరో వీడియోలో కొందరు విద్యార్థులను బ్యాగులు ధరించి చేతులు పైకెత్తి నిలబడాలంటూ శిక్ష విధించిన విషయం కూడా బయటపడింది. బ్యాగుతో నిలబడి ఉన్న ఓ బాలుడు ఊపిరాడక విలవిలలాడిపోతుంటే.. అతడి స్నేహితులు నీరు తాగించే ప్రయత్నం చేస్తుండటం వీడియోలో ఉంది.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్వయంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోక్యం చేసుకున్నారు. దీంతో, ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ భారతమ్మ, టీచర్ మునియప్పలను అదుపులోకి తీసుకున్నారు. వృత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేశారు . కాగా, ఈ ఘటనకు సంబంధించి మరో నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా విధుల నుంచి తొలగించారు. కాగా, దేశంలో మనుషులతో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయించడాన్ని మూడు దశాబ్దాల కిందటే నిషేధించారు. అయితే, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. శిక్ష రూపంలో పిల్లలతో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రపరచడం వారి ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా వారు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.