ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో భారీ కుదుపులు చోటుచేసుకున్నాయి. సిట్టింగులను మార్చడానికి పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలపై రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ హై కమాండ్ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎలీజా ఆలోచించి చెబుతానన్నట్లుగా సమాచారం. ఎలీజా స్థానంలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వియ్యంకుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్థానాన్ని మార్చే యోచనలో వైసీపీ మై కమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అరకు ఎంపీగా తెల్లం బాలరాజుని వెళ్లాలని హై కమాండ్ సూచించినట్లు తెలుస్తోంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఏలూరు ఎంపీ అభ్యర్థిగా నిలిపే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి కారుమూరికి సూచనప్రాయంగా ఇప్పటికే వైసీపీ పెద్దలు వెల్లడించినట్లు సమాచారం. మంత్రి కొట్టు సత్యనారాయణకు కూడా స్థాన భ్రంశం కలిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాడేపల్లిగూడెం నుంచి వేరే చోట టికెట్ ఇచ్చే అవకావం ఉందని సమాచారం. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పోటీ చేసే స్థానాన్ని కూడా పార్టీ పెద్దలు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని స్థానంలో బీసీ అభ్యర్థిని నిలబెడతారని పార్టీ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. హై కమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలతో వైసీపీ నేతలు అంతర్మథనంలో పడిపోతున్నారు. స్థానాలను మారిస్తే ఎమ్మెల్యే అభ్యర్థులకు కొంతమేర వ్యతిరేకత తగ్గే అవకాశం ఉందని హై కమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.