జీబీసీ(గుంతకల్లు బ్రాంచి కెనాల్) కింద ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని పీఏసీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువ నుంచి జీబీసీకి నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం రైతులతో కలిసి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు వద్ద ఆందోళనకు దిగారు. అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై బైఠాయించడంతో కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆందోళన విరమించాలని పోలీసులు, హంద్రీనీవా అధికారులు కోరారు. నీటి విడుదలకు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా కదిలేది లేదని పయ్యావుల భీష్మించారు. దీంతో కేశవ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్యా భారీగా తోపులాట జరిగింది. కేశవ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.