ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా సాగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో అధికార విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం, జనసేన ప్రకటించాయి. దీనికి సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యాచరణ సహా అనేక అంశాలపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పలుసార్లు భేటీ కూడా అయ్యారు. ఈ క్రమంలోనే శనివారం ఆంధ్ర రాజకీయాల్లో కీలక మలుపు ఏర్పడింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబు నాయుడి నివాసంలో ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్ నుంచి నారా లోకేష్‌తో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్.. లోకేష్ కారులోనే చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు, లోకేష్, ప్రశాంత్ కిషోర్ దాదాపుగా 3 గంటల పాటు సమావేశం అయ్యారు.ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా.. చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచింది. అయితే చంద్రబాబు సీనియర్ రాజకీయనేత కావడంతోనే ఆయన్ను కలిశానని, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని పీకే తెలిపారు. అనంతరం ఐప్యాక్ టీమ్ సైతం ఇదే తరహాలో ట్వీట్ చేసింది. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కోసం తాము ఏడాది కాలంగా వైఎస్సార్సీపీ తరఫున పని చేస్తున్నట్లు ఐప్యాక్ వెల్లడించింది.
"ఏడాది కాలంగా వైఎస్సార్సీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు జగన్ తిరుగులేని ప్రయత్నం చేస్తున్నారు. 2024లో మరోసారి జగన్ ఘన విజయం సాధించేంత వరకు అవిశ్రాంతంగా పనిచేసేందుకు మేం (వైఎస్సార్సీపీ, ఐప్యాక్) అంకితమయ్యాం" అని ఐప్యాక్ టీమ్ ట్వీట్ చేసింది చంద్రబాబు, లోకేష్, పీకే మధ్య దాదాపు 3 గంటల పాటు జరిగిన సుదీర్ఘ మంతనాల్లో కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం. ఏపీలో తాను నిర్వహించిన సర్వే నివేదికలను చంద్రబాబు ముందు ప్రశాంత్ కిషోర్ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్‌తో పాటు.. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కోసం కలిసి పనిచేస్తున్న టీమ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో 2024 లో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తారేమో అనే భావన వ్యక్తమైంది. అయితే తాజా ట్వీట్‌తో ఐప్యాక్ స్పష్టతనిచ్చింది.
ఐ ప్యాక్ టీమ్ గతంలో జగన్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 151 సీట్లు రావడంలో ఐ ప్యాక్ కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా జగన్ పార్టీ కోసం తాము పని చేస్తున్నట్లు ఐప్యాక్ టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతను కలవడం, ఈ భేటీలో టీడీపీ కోసం పని చేస్తున్న వ్యూహకర్త, ఒకనాటి పీకే సహచరుడు రాబిన్ శర్మ కూడా పాల్గొన్నాడని ప్రచారం జరుగుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.