జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు చర్యలు వద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టే వరకు విశాఖకు కార్యాలయాలు తరలించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశాల్లో పేర్కొంది. అమరావతి, విశాఖపట్నంలో కార్యాలయాల నిర్వహణ కోసం అనవసర ఖర్చును నివారించడం కోసం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వం ప్రజాధనానికి ధర్మకర్త అని గుర్తుచేసిన హైకోర్టు ధర్మాసనం.. త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాలా.. లేదా అనే విషయమై తగిన నిర్ణయం తీసుకునేందుకు పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తద్వారా పరస్పర విరుద్ధ ఉత్తర్వుల జారీకి వీలులేకుండా ఉంటుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈనెల 21న ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా ఆ ఉత్తర్వులు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని భూసమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
సాధారణ పరిపాలనశాఖ ఈ ఏడాది నవంబరు 22న జారీచేసిన జీవో 2283 అమలును నిలిపివేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. అమరావతి నుంచి కార్యాలయాలను తరలించడానికి వీల్లేదని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పరోక్షంగా అధిగమించడం కోసం కాంపు కార్యాలయం ముసుగులో ఈ వ్యవహారం నడిపిస్తున్నారన్నారని వాదించారు. ప్రజాధనాన్ని వృథా చేసే ప్రక్రియను నిలువరించాలని న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. సమీక్ష సమావేశాల నిర్వహణకు కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామని అనుబంధ పిటిషన్‌లో తెలిపింది. సచివాలయం నుంచి కార్యాలయాలను తరలించడం లేదని చెప్పింది. విశాఖలో ఆయా శాఖలకు కార్యాలయాల కేటాయింపునకు సమయం పడుతుందని వెల్లడించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. మూడు రాజధానుల చట్టాన్ని సవాల్ చేస్తూ గతంలో వ్యాజ్యాలు దాఖలయ్యాయని తెలిపారు. ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అమరావతే రాజధాని అంటూ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిందని గుర్తుచేశారు.
ప్రభుత్వ ఉద్దేశాన్ని పరోక్షంగా నెరవేర్చుకునే వ్యవహారంతో ప్రస్తుత పిటిషన్లు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. ఈ పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకునేందుకు సీజే వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తగిన ధర్మాసనం విచారణ జరిపే వరకు అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ఏవిధమైన చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.