థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్.. మంత్రి ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో జరిగిన శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహా విష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజాకు అహంకారం ఎక్కువని విమర్శించారు. అంతేకాదు, వైఎస్ఆర్సీపీ నాయకుల నోళ్లను ఫినాయిల్‌తో కడిగినా మారవని, మంచి మాట్లాడినా వారు చెడుగా అర్థం చేసుకుంటారని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. ఈ కూటమి 135 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో అద్భుతమైన విజయం సాధిస్తుందని పృథ్వీరాజ్ అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన యువగర్జన ముగింపు విజయోత్సవ సభ ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభలా మారిందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాట ప్రజలకు చేరువైందని పృథ్వీ అన్నారు. వైసీపీ నాయకులకు మంచి మాట్లాడిన చెడుగా అర్థమవుతుందని దుయ్యబట్టారు.
‘నిజంగా 175కు 175 సీట్లు వైఎస్‌ఆర్సీపీకి వచ్చే పరిస్థితి ఉంటే 92 స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఎందుకోసం.. ఉప్పెన, సునామీ వచ్చే ముందు ఎలా ప్రశాంతంగా ఉంటుందో.. ప్రస్తుతం జనాలు అలా ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండాలతో రాష్ట్రంలో శాంతి నెలకుంటుంది... రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. బలిజ ఐక్యత ఎలా ఉంటుందో రాబోయే ఎన్నికల ఫలితాలతో నిరూపితం అవుతుంది.
అధికార పార్టీ నేతలు ఎంతగా రెచ్చగొట్టినా, కవ్వింపులకు దిగినా సహనం కోల్పోవద్దు.. ఆవేశానికి లోను కావద్దు.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా నేను సిద్ధంగా ఉన్నా.. మంత్రి అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడు. రోజాకు అహంకారం ఎక్కువ.. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం అధికార పార్టీ నుంచి జంపింగ్‌లు ఎక్కువగా ఉంటాయి.’ అని పృథ్వీరాజ్ విరుచుకుపడ్డారు.