ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ కీలక నిర్ణయం.. జనవరి 4 నుంచి 'జయహో బీసీ'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 06:21 PM

ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ టీడీపీ జనంలోకి వెళుతోంది. నారా లోకేష్ పాదయాత్ర పూర్తికాగానే చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అలాగే లోకేష్ కూడా జనవరి 11 నుంచి జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. అలాగే వచ్చే నెలలో మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. జయహో బీసీ పేరిట జనవరి 4న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారన్నారు.


ఈ కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందని.. తొలి విడతలో పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో టీడీపీ నేతలు పర్యటిస్తారన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని వివరించారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యం కల్పించామన్నారు. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. బీసీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బీసీల ద్రోహి అన్నారు.


బీసీ సోదరుల తరఫున పోరాడుతున్న టీడీపీ బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారన్నారు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెనాయుడుతో సహా ఎంతోమంది బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారన్నారు. శ్రీకాళహస్తిలో తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ముని రాజమ్మ ధ్వంసం చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. బీసీలు బలహీనులు కాదు.. బలవంతులన్నదే తెలుగుదేశం నినాదమన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం మాత్రమే అన్నారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యమిచ్చామన్నారు. టీడీపీ అధికారంలో వచ్చాక బీసీలకు శాశ్వత కుల ద్రువీకరణ పత్రాలు అందజేస్తామనిత తెలిపారు. బీసీ ఉపకులాలకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి వారికే ఖర్చు చేస్తామని చెప్పారు.


వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్‌ తగ్గించిందని.. దీంతో 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేశారన్నారు. 8 వేల ఎకరాల బీసీల అసైన్డ్‌ భూములను కూడా వెనక్కి తీసుకుందని.. ఆదరణ పథకాన్ని రద్దు చేసిందన్నారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని తన యువగళం పాదయాత్రలో కొందరు చెప్పారన్నారు. 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసినా నిధులు, విధుల్లేవని.. జీవో 217 తీసుకొచ్చి మత్స్యకారుల వెన్నెముక విరగ్గొట్టారన్నారు. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదన్నారు.


వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా అంటూ లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని.. ఇలాంటి సినిమాలకు సీఎం జగనే డబ్బులు పంచుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్జీవీ తరపున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డని, ఆ అడ్వకేట్లను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నామని.. నిజంగా సినిమా తీయాలంటే హు కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్సులో జరుగుతున్న అవినీతి మీద తీయొచ్చుకదా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com