ఏలూరు జిల్లాలో గంజాయి గుప్పుమంది. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలోని రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు దగ్గర తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు 110 ప్యాకెట్లలో 220 కిలోల గంజాయిని 11 గోనె సంచుల్లో నింపి లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన సందీప్ శంకర్, ప్రకాశ్ రాథోడ్‌లను అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులిద్దరూ ఇటీవల వరంగల్‌కు ఉల్లిపాయల లోడు తీసుకొచ్చారు. అనంతరం రాజమహేంద్రవరం నుంచి గంజాయి తీసుకొస్తే రూ.50 వేలు ఇస్తామని ఔరంగాబాద్‌కు చెందిన అమర్, దీపక్‌లు ఆశ పెట్టడంతో ఆ పట్టణంలోని ఓ హోటల్ వద్దకు వెళ్లగా ఓ వ్యక్తి సమీప ప్రాంతానికి తీసుకెళ్లి గంజాయి లోడ్ చేశారు. ఈ సమాచారం టాస్క్‌ఫోర్స్ సీఐ ధనరాజ్‌కు అందడంతో జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనివాసరావు, ఇతర సిబ్బందితో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేశారు. లారీలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని గుర్తిస్తామని ఏఎస్పీ తెలిపారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తులతోపాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రదర్శించారు. పోలీసులు సీజ్ చేసిన గంజాయి విలువ రూ.22 లక్షల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.