మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు ఓ పత్రిక, ఛానల్‌లో వచ్చినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడంపై బుద్ధప్రసాద్ తనయుడు వెంకట్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిని గుర్తించి కేసు నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐను కలిసి ఫిర్యాదు చేశారు. తన తండ్రి పార్టీ మారుతున్నారంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ నమ్మ వద్దని కోరారు. కొంతమంది కావాలనే దురుద్దేశంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని.. అటువంటి వదంతులు నమ్మొద్దని కోరారు. తన తండ్రి అభివృద్ధిని కోరుకునేవారని, అది చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. తన తండ్రి టీడీపీని వీడే ప్రసక్తే లేదన్నారు.. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి భారీ ఆధిక్యంతో గెలవడం ఖాయమని వెంకట్రామ్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్య పదజాలం వాడుతూ వాటి పరువు తీస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆనాడు మహర్షి బులుసు సాంబమూర్తి వంటి వారు చట్టసభల కీర్తి పెంచితే.. వీరు మాత్రం దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కాకినాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కోకనాడ మహాసభల శతాబ్ది ఉత్సవాలలో ఈ కామెంట్స్ చేశారు. నేటి రాజకీయాల్లో రూ.కోట్లు ఖర్చు చేస్తే పార్టీలు టికెట్లు ఇస్తున్నాయని, దోచిన సొమ్మును దాచుకోడానికి కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారన్నారు. కాకినాడ కాంగ్రెస్ మహాసభలు పోరాట పటిమ, త్యాగనిరతిని చాటి చెప్పాయన్నారు. తెలుగునాట విజయవాడ, కాకినాడల్లో జరిగిన కాంగ్రెస్ మహాసభలు దేశ గతిని మార్చాయని గుర్తుచేశారు.