తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ బస్సుయాత్రలో భాగంగా ఇటీవల పట్టణంలోని సీబీరోడ్డులో ఉన్న విద్యుత్తు స్తంభాలకు పార్టీ జెండాలు కట్టారు. వాటిని తొలగించాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేయడం, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారని ఆయనతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా విద్యుత్తు దీపాల ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ జెండాలు అడ్డుగా ఉన్నాయని, తొలగించాలని కోరితే పోలీసులు కేసులు నమోదు చేయడం సరికాదన్నారు టీడీపీ నేతలు.
మరోవైపు తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించాలంటూ ధర్నా చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జెండాలను తొలగించాల్సిందేనని జేసీ ప్రభాకర్ రెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఆయన్ను బలవంతంగా పోలీసులు అక్కడ నుంచి తరలించారు. అంతకముందు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళణకు దిగారు. వైఎస్సార్‌సీపీ జెండాలను పోలీసులు తేసేస్తామని హామీ ఇచ్చి తీయకపోవడంపై ఆయన ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా, పోలీసులకు ప్రభాకర్ రెడ్డికి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రెండు రోజుల్లో అడ్డుగా ఉన్న జెండాలను తొలగిస్తామని పోలీసులు హామీ నిలబెట్టుకోలేదన్నారు. నాలుగైదు రోజులుగా ఈ జెండాల వివాదం నడుస్తోంది.