టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై దాఖలైన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో.. లోకేష్‌పై అరెస్టు ఉత్తర్వులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. రింగ్ రోడ్డు కేసులో లోకేష్ నిందితుడిగా ఉన్నారని.. తాము జారీ చేసిన 41ఏ నోటీసులో పేర్కొన్న షరతులకు లోబడి వ్యవహరించడంలో ఆయన విఫలమయ్యారని కోర్టుకు తెలిపింది. సాక్షులను, దర్యాప్తు అధికారులను బెదిరించేలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. సీఐడీ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు లోకేష్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
లోకేష్‌ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని కోర్టు ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఆదేశించిన మేరకు లోకేష్‌కు నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. ఆ సమయంలో లోకేష్ నివాసంలో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. అధికారులు చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేకపోయింది. నోటీసులు అందించేందుకు శుక్రవారం ఉదయం రావాలని లోకేష్ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు. దీంతో లోకేష్‌కు ఇవాళ నోటీసులు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.