ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార వైఎస్సార్‌సీపీలో సీట్ల మార్పు, చేర్పులు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తూ మన ప్రియతమ నాయకుడు జగన్ నన్ను గుర్తించకపోయినప్పటికీ.. ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుర్తించారు. వారి గుండెల్లో పెట్టుకుని, ఎటువంటి అవమానాలు ఎదురైనా నన్ను కాపాడుతూ వస్తున్నారు' అని కామెంట్స్ చేశారు.
'నా వెనుక అండగా ఉంటున్నారు. వారికి ఎప్పటికీ ఓ సేవకుడిగా ఉంటాను అన్నారు. తాను ఎక్కడ ఉన్నా పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. నామినేషన్ వేసిన ప్రతీసారి సారథి ఓడిపోయాడు.. పెనమలూరు తెలుగుదేశందేనని చెప్పుకుంటుందన్నారు. కానీ అన్నీ వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమయంలో వేదికపై ఉన్న జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూవేదిక దిగి వెళ్లిపోయారు. నేతలు ఆపుతున్నా.. జోగి ఆగకుండా వెళ్లిపోయారు. దీంతో కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సీఎం జగన్ తనను గుర్తించలేదని ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యానించడం పార్టీ నేతల్లో ఆగ్రహం వచ్చేలా చేసింది.