మైనారిటీ కాలనీల అభివృద్ధికి రూ.1,000 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు మైనారిటీ సంక్షేమం, గృహ నిర్మాణ శాఖల పురోగతిని సమీక్షించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, కార్యాచరణ ప్రణాళికను రూపొందించే సమయంలో నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ను నిలిపివేసిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వమే 6.4 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను అందజేయాలని నిర్ణయించిందని సిద్ధరామయ్య తెలిపారు.
బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించామని, మైనారిటీ సంక్షేమ శాఖలో ఉన్న నిధులను పునర్విభజన చేసి అదనంగా మరో 40 కోట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.మైనారిటీల కోసం ఉద్దేశించిన వివిధ పథకాల కోసం ఆన్‌లైన్‌లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, వచ్చే ఏడాదికి మరిన్ని గ్రాంట్లు అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.వివిధ పథకాల కింద ప్రస్తుత సంవత్సరంలో 3 లక్షల ఇళ్లకు గాను 1.31 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, గృహనిర్మాణ శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి మార్చి నాటికి 1.6 లక్షల ఇళ్ల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.