తిరుమల వెళ్లే భక్తుల్ని టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం రేపాయి. ట్రాప్ కెమెరాలకు చిరుత, ఎలుగుబంటి కదలికలు చిక్కాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు రికార్డయ్యాయి. శ్రీ నరసింహ స్వామి ఆలయంకు సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుత, ఎలుకబంటి కదలికలు దొరికాయి. డిసెంబరు 13, 29 ట్రాప్ కెమెరాకు చిరుత, ఎలుగుబంటి కదలికల్ని గమనించారు. దీంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది.. తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు కొన్ని సూచనలు చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.
గతంలో అలిపిరి నడకదారి మార్గంలో చిరుతులు సంచరించాయి.. ఓ బాలుడిపై దాడి చేయగా.. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బాలికపై దాడి చేసి చంపేసింది.. ఆ తర్వాత టీటీడీ అప్రమత్తం అయ్యింది. అటవీశాఖ అధికారులతో కలిసి బోన్లు ఏర్పాటు చేసి ఐదు చిరుతల్ని బంధించారు.. ఆ తర్వాత చిరుతల బెడద తప్పిపోయిందని అటవీశాఖ అధికారులు భావించారు.. కానీ తాజాగా మరో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్లు గుర్తించడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే నడకమార్గంలో కొన్ని నిబంధనల్ని అమలు అమలు చేస్తున్నారు.
తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలిపిరి నడకమార్గంలో రాత్రి 10 గంటల తర్వాత భక్తుల్ని అనుమతించడం లేదు.. ఉదయం ఆరు గంటల తర్వాత మాత్రమే నడకదారిలో అనుమతిస్తారు. అలాగే నడక మార్గంలో 12 ఏళ్లలోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతించడం లేదు.. చిరుతల నుంచి రక్షణ పొందేందుకు భక్తులకు ఊత కర్రల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలిపిరితో పాటుగా శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు గుంపులుగా నడిచి వెళ్లాలని టీటీడీ సూచిస్తోంది. అలాగే కొంతమంది గార్డుల్ని నియమించారు.