దేశంలో మరోసారి కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్-19 ముప్పు దాదాపు తొలగిపోయిందని భావిస్తున్న తరుణంలో... గత వారం పది రోజుల నుంచి మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళలో పెద్ద సంఖ్యలో కేసు నమోదవుతుండగా.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. తాజాగా, బెంగళూరులో పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక ఒకటి బయటపెట్టింది. దాదాపు రెండేళ్లుగా బెంగళూరులోని మురుగు నీటిలో సార్స్-కోవ్-2 పర్యవేక్షణ నిర్వహిస్తోన్న టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టిఐజీఎస్) ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో నివేదికను అందజేసింది. ఈ సందర్భంగా మురుగు నీటిపై నిఘా కొనసాగించాలని సూచించింది.
బెంగుళూరు మురుగునీటిలో గత రెండు వారాలుగా కోవిడ్-19 పాజిటివిటీ రేటు 96 శాతంగా ఉన్నట్టు టీఐజీఎస్ తాజా నివేదిక హెచ్చరించింది. మొత్తం 26 మురుగు కాలువల్లో 25 పాజిటివ్‌గా తేలాయి. హుళిమావు, దొడ్డబెల్లి, నాగసంద్ర పీహెచ్1, యెలహంక, హలసూరు, కబ్బన్ పార్క్‌లోని ఎస్టీపీల్లో వైరల్ లోడ్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై టీఐజీఎస్ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కే మిశ్రా మాట్లాడుతూ.. అధిక పాజిటివిటీ రేట్‌ని చూడాల్సిన అవసరం లేదని దానికి బదులుగా పాజిటివిటీ చూపిన 25 సైట్‌ల మొత్తం ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
రాబోయే రోజుల్లో మరో ప్రాంతం కూడా కరోనా వైరస్‌కు నిలయంగా మారవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘వైరల్ లోడ్ పెరిగిందనే విషయంపై దృష్టి పెట్టాలి, అంటే మనం వేవ్ ప్రారంభంలో ఉన్నాం... మేము వాస్తవానికి 3-4 వారాలుగా వైరల్ నమూనాల పెరుగుదలను చూస్తున్నాం.. లక్షణాలు లేని చాలా మంది కరోనా పరీక్షలు చేయించుకోరు.. కానీ వారు ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటి ద్వారా వైరస్‌ను బయటకు పంపుతారు.. ఇది అధిక వైరల్ లోడ్‌కు కారణం.. ఓమిక్రాన్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది.. , మనం జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపారు.
టిజ్స్ నిఘా ప్రకారం.. ఈ ఏడాది జూన్- అక్టోబర్ మధ్య ప్రతి మిల్లీలీటరుకు SARS-CoV-2 వైరల్ లోడ్ 1000 కంటే తక్కువగా ఉండగా.. డిసెంబరులో దాదాపు 3,000కి చేరింది. పెద్ద సంఖ్యలో కేసులు, ప్రాణాలు కోల్పోయిన మొదటి రెండు వేవ్‌ల మాదిరిగా ఈసారి పరిస్థితి ఉండదని ఆయన పేర్కొన్నారు. ‘మొదటి రెండు వేవ్‌లు ఊపిరితిత్తులను ప్రభావితం చేశాయి.. కానీ ఓమిక్రాన్‌తో మూడో వేవ్‌లో వైరస్ తీవ్రత తగ్గి ఎగువ శ్వాసకోశాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. కేసులు పెరిగినప్పటికీ, తేలికపాటి లక్షణాలు కనిపించాయి. అప్పటికి, టీకాలు కూడా సహాయపడ్డాయి. నాల్గో వేవ్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందింది.. కేసులు మధ్యలో ఆగిపోయాయి, కానీ బూస్టర్ డోస్‌లు ప్రజలను కాపాడాయి ’ అని చెప్పారు.
‘ఇది కూడా సైలెంట్ వేవ్ కావచ్చు.. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభావితమైనా పరిస్థితి స్వల్పంగా ఉంటుంది.. చాలా మందికి లక్షణాలు బయటపడవు’అని మిశ్రా వివరించారు. అయినప్పటికీ అనారోగ్య సమస్యలున్నవారు, వయసుపైబడినవారు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. వైరస్‌ను అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి మిశ్రా మాట్లాడుతూ.. వైరస్ ఎలా పెరుగుతోందో.. తగ్గుతుందో తెలియడానికి ప్రతి నగరంలో పర్యావరణ పర్యవేక్షణ నిర్వహించాలని అన్నారు. ఎవరికైనా రోగ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పరీక్షించాలి. క్లినికల్ టెస్టింగ్‌తో పాటు మురుగునీటి నిఘా వంటి వాటి ద్వారా వేరియంట్ మనకు తెలుస్తుంది... ఇందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండాలి’ అని అన్నారు.
కాగా, గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ కర్ణాటకలో 158 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 95 శాతం బెంగళూరు నగరంలో ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో యాక్టివ్ కేసులు 500కు చేరగా.. ఒక్క బెంగళూరులోనే 414 ఉండటం గమనార్హం.