అయోధ్యలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న దివ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతోంది. ఈ క్రమంలోనే జనవరి 22 వ తేదీన అయోధ్య రామమందిర గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొత్తం 3 విగ్రహాలను తయారు చేయించింది. వాటిలో నుంచి ఒక విగ్రహాన్ని శుక్రవారం ఎంపిక చేశారు. ఆలయ ట్రస్ట్ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మౌఖిక ఓటింగ్ ద్వారా ఒక విగ్రహాన్ని ఖరారు చేశారు.
51 అంగుళాల ఎత్తుతో ఉన్న ఆ రాముడి విగ్రహం ఐదేళ్ల బాలుడి రూపంలో ఉండనుందని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుంచి మాత్రమే దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉందని పేర్కొన్నాయి. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే బాల రాముడి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. అందులో నుంచి ఒక విగ్రహాన్ని తాజాగా ఎంపిక చేశారు. ఇప్పుడు అదే విగ్రహాన్ని వచ్చే నెలలో అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. అయితే ఇప్పటికే విగ్రహం ఎంపిక పూర్తైనప్పటికీ.. ఆ విగ్రహం ఎంపికపై పలువురి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే.. ఆ బాల రాముడి రూపాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటివరకు ఉన్న పాత విగ్రహాన్ని అచల మూర్తిగా వ్యవహరిస్తుండగా.. కొత్త తయారు చేసిన విగ్రహాన్ని ఉత్సవమూర్తిగా పిలవనున్నారు.
ఇక అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22 వ తేదీన బాల రాముడి విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్ఠించేందుకు 7 రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనవరి 16 వ తేదీన ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాలు.. ప్రతిష్ఠాపన జరిగే రోజు వరకు కొనసాగనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఇక ఈ వారం రోజులపాటు ఏయే రోజు ఏయే కార్యక్రమం నిర్వహించేది అన్ని వివరాలతో ట్రస్టు ఒక ప్రకటన విడుదల చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
జనవరి 16 వ తేదీన వేద పండితులతో సర్వ ప్రాయశ్చిత్ హోమం, దశవిద్ స్నానం చేయించనున్నారు. 17 వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా విగ్రహంతో ఊరేగింపు నిర్వహించనున్నారు. 18 వ తేదీన గణేశ్ అంబికా, వరుణ, వాస్తు తదితర పూజా కార్యక్రమాలను చేయనున్నారు. 19 వ తేదీన అగ్ని స్థాపన, నవగ్రహ స్థాపనలు నిర్వహించనున్నారు. 20 వ తేదీన సరయూ నది పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి సంప్రోక్షణ చేయనున్నారు. 21 వ తేదీన 125 కలశాలతో దివ్య స్నానం చేయించనున్నారు. ఇక చివరగా.. జనవరి 22 వ తేదీన రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇక అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి పవిత్ర జలాన్ని తీసుకు రానున్నారు. పీవోకేలోని శారద పీఠం ఆలయ ప్రాంగణంలోని సరస్సు నుంచి ఈ జలాన్ని సేవ్ శారద కమిటీ - కాశ్మీర్ బృందం తీసుకురానుంది. ఇక అయోధ్య రామాలయంలో నిర్వహించనున్న హారతిలో పాల్గొనే వారికి ఉచితంగా ఆలయ కమిటీ పాస్‌లు జారీ చేస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ పాస్‌లు పొందొచ్చని తెలిపింది. రోజుకు మూడుసార్లు మాత్రమే జరిగే ఈ హారతిలో గరిష్ఠంగా ఒకసారి 30 మంది మాత్రమే పాల్గొనవచ్చని వెల్లడించింది.