పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్థాన్ చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం, అక్కడ ఉగ్రవాద శిక్షణలు ఇప్పించడం, ఉగ్రవాదులకు స్వయంగా పాక్ ఆర్మీ సహాయపడటం చూస్తూనే ఉన్నాం. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించి.. ఉగ్రదాడులకు పాల్పడేలా పురమాయిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ప్రముఖ ఆలయమైన శారదా ఆలయాన్ని ప్రస్తుతం పాక్ ఆర్మీ ఆక్రమించిందని.. ఆ ఆలయ కమిటీ సేవ్ శారద కమిటీ తాజాగా వెల్లడించింది. ఈ విషయాన్ని సేవ్ శారద కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత స్వయంగా తెలిపారు.
శారద ఆలయాన్ని ఆక్రమించిన పాకిస్థాన్ సైన్యం.. ఆలయ పరిసరాల్లో కాఫీ హోంని కూడా ఏర్పాటు చేసిందని రవీంద్ర పండిత పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే శారదా ఆలయంలో పాకిస్థాన్ ఆర్మీ అక్రమంగా ఏర్పాటు చేసిన కాఫీ హోం ఆక్రమణలను తొలగించడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రవీంద్ర పండిత కోరారు. వాస్తవానికి ఈ స్థలం విషయంలో సేవ్ శారదా కమిటీకి అనుకూలంగా కోర్టు తీర్పు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు.
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. పాక్ సైన్యం మాత్రం ఆ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. శారదా ఆలయం గోడలను ధ్వంసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఓకేలోని శారదా ఆలయంలో పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న దురాగతాలను తాము వ్యతిరేకిస్తూ తీవ్రంగా పోరాడుతున్నామని చెప్పారు. పీవోకేలోని స్థానిక ప్రజలు కూడా సేవ్ శారదా కమిటీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. అయితే తాము చేస్తున్న ఈ పోరాటానికి భారత ప్రభుత్వం కూడా మద్దతు తెలపాలని కోరుతున్నట్లు రవీంద్ర పండిత విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని పీఓకేలోని శారదా ఆలయ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. శారద ఆలయాన్ని అభివృద్ధి చేసి.. దానికి వారసత్వ సంపద గుర్తింపును ఇవ్వాలనని రవీంద్ర పండిత విజ్ఞప్తి చేశారు.