తిరుపతి జిల్లాలో సినిమాలో యాక్షన్ సీన్‌ను తలదన్నేలా చోరీ జరిగింది. ఏర్పేడు మండలంలోని పాపా నాయుడుపేటలో ఉన్న బంగారం దుకాణంలో బంగారం ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అయితే వారు నాటు తుపాకులు, ఐరన్ రాడ్లు పట్టుకుని నానా హంగామా సృష్టించారు. ఇద్దరు దొంగలు షాప్‌లో దొంగతనం చేసి నగలను తీసుకుని పరారీ కాగా.. మరో దొంగ మాత్రం స్థానికులకు చిక్కాడు. అయితే ఆ దొంగను పట్టుకునేందుకు స్థానికులు పెద్ద సాహసమే చేశారు. అనంతరం ఆ దొంగకు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.
మొదట నాటు తుపాకులు, కత్తులు, ఐరన్ రాడ్లతో ముగ్గురు దుండగులు.. జ్యువలరీ షాప్ వద్దకు చేరుకున్నారు. నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు దొంగలు.. ఆ దుకాణంలో బంగారాన్ని దొంగిలించారు. అది గమనించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ముగ్గురు దొంగల్లో ఒకడు.. తమ వద్ద ఉన్న తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మిగితా ఇద్దరు ఐరన్ రాడ్లతో స్థానికులను బెదిరింపులకు గురి చేశారు. అయినా వెనక్కి తగ్గని స్థానికులు.. ప్రాణాలకు తెగించి ఆ ముగ్గురు దుండగుల్లో ఒకరిని పట్టుకున్నారు. మిగితా ఇద్దరు మాత్రం చోరీ చేసిన బంగారంతో అక్కడి నుంచి ఉడాయించారు.
ఇక దొరికిన ఆ దొంగను స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించగా.. వారు వచ్చి అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ దొంగ రేణిగుంట జ్యోతినగర్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. స్థానిక వైకాపా నేతకు చెందిన ఈ ఎస్ ఎస్ జ్యువలరీ షాపు గాజుల మండ్యం వద్ద ఉంది. ఘటన తర్వాత పోలీసులు జ్యువెలరీ షాప్‌లో పరిస్థితిని పరిశీలించారు. అయితే ఆ జ్యువలరీ షాప్‌లో ఎంత బంగారం చోరీకి గురైంది అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఏర్పేడు సీఐ శ్రీహరి.. నిందితులను త్వరగా పట్టుకుంటామని తెలిపారు. తమ అదుపులో ఉన్న దొంగను విచారణ చేస్తున్నామని.. కొన్ని క్లూస్ ఆధారంగా మిగిలిన వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.