జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అయితే ఆ సినిమాలో జైలు శిక్ష అనుభవిస్తున్న హీరో.. జైలు నుంచే లా చదివి లాయర్ అవుతాడు. అచ్చం అలాంటి సీనే మళ్లీ ఇప్పుడు రిపీట్ అయింది. కడప జిల్లా కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ తాజాగా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ కోర్సు చేసిన మహమ్మద్ రఫీ.. ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. నంద్యాలకు చెందిన మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఈ ఘనత సాధించాడు. నంద్యాల జిల్లా సంజామల మండలం సోములకు చెందిన మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడే మహమ్మద్ రఫీ. అయితే ఓ హత్య కేసులో మహమ్మద్ రఫీ దోషిగా తేలడంతో అతడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం అతను కడప సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తనకు ఇష్టమైన చదువును కొనసాగించాలని భావించిన మహమ్మద్ రఫీ.. ఆ విషయాన్ని కడప సెంట్రల్ జైలు అధికారులకు చెప్పడంతో వారు కూడా సహకరించారు. దీంతో హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇందులో అత్యధిక మార్కులు సాధించి గోల్డ్ మెడల్ సాధించాడు. డిసెంబర్ 28 వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జగదీష్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకుని శనివారం కడపకు చేరుకున్నాడు. ఈ మేరకు బెయిల్‌పై వచ్చి గోల్డ్ మెడల్ అందుకున్న మహమ్మద్ రఫీ.. తిరిగి కడప సెంట్రల్ జైలుకు వెళ్లాడు. కాగా యావజ్జీవ కారాగార శిక్ష పడినా.. జైలు జీవితంతో కుంగిపోకుండా అనుకున్నది సాధించిన మహమ్మద్ రఫీపై ప్రశంసల జల్లు కురుస్తోంది.