ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2024లో శిశుపాలుడిని సాగనంపుదాం,,,,చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 09:54 PM

తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఆశలతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షిస్తున్నట్టు ఓ ప్రకటనలో  తెలిపారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదాం అని పిలుపునిచ్చారు.కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయతీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరచిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తాం. 


నాలుగున్నరేళ్ళ నరకానికి పరాకాష్ఠను 2023లో ప్రత్యక్షంగా అనుభవించాం... భరించాం! "ఒక్క అవకాశం" అని ప్రాధేయపడితే నమ్మి, అర్హత లేని వారిని అందలమెక్కిస్తే జరిగిన నష్టాన్ని మనమందరం కళ్లారా చూశాం. అందుకే ఒక కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు, అమానుషానికి తావులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేద్దామని ప్రతిన పూనుదాం. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపేందుకు తెలుగు సోదర, సోదరీమణులు సిద్ధం కండి. 


ప్రతి తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి నాంది పలుకుదాం. విశ్వ వినువీధుల్లో తెలుగుజాతి జయపతాక రెపరెపలాడిద్దాం. భరతజాతి సమృద్ధికి మనవంతు చేయూతనిద్దాం. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై సాగే సుపరిపాలన కోసం, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం మనం సమగ్ర పథక రచన చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు.  ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీలతో తొలివిడత మ్యానిఫెస్టో విడుదల చేశాము. మలివిడతగా 'తెలుగుదేశం’, ‘జనసేన' కలిసి రాష్ట్ర దశ, దిశ మార్చివేసే సమగ్ర మ్యానిఫెస్టోను త్వరలోనే ప్రకటించబోతున్నాం. నూతన సంవత్సరంలో మరో నూరు రోజుల్లో ఆటవిక పాలన నుండి తెలుగు ప్రజలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ఏ శక్తి అడ్డుకోకుండా చూసే పూచీ నాది. రండి! కలిసి రండి !! పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదాం!!  కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు, సిరిసంపదలు, శాంతి భద్రతలు, ఆయురారోగ్యాలు నింపాలని మనసారా కోరుకూంటూ....శుభాకాంక్షలతో... మీ నారా చంద్రబాబు నాయుడు" అంటూ  చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com