భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. న్యూ ఇయర్‌ను కొత్తగా ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్ రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్) ను పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ఈ ఉదయం 9.10 గంటలకు ముగిసింది. అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ రాకెట్ బయలుదేరింది.
ఈ పీఎస్‌ఎల్వీ రాకెట్ ద్వారా భారత్‌కు చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుందని.. ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగంలో కేరళలోని తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ పేలోడ్‌లు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఈ ఎక్స్‌పోశాట్ ప్రయోగం భారత అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి తొలి అడుగు కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై దృష్టి సారించిన గత ప్రయోగాల లాగా కాకుండా.. ఎక్స్-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యమని తెలిపారు. అయితే ఇలాంటి ప్రయోగం ప్రపంచంలోనే రెండోదని.. భారత్ కంటే ముందు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రమే చేసిందని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్‌పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఎక్స్‌పోశాట్ జీవితకాలం అయిదేళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌కు సంబంధించిన వివరాలను ఎక్స్‌పోశాట్ బహిర్గతం చేస్తుంది. పీఎస్‌ఎల్‌వీ చివరి దశలో మరో 10 పరికరాలను నింగిలోకి మోసుకెళ్లింది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు.