తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి (జనవరి 2) నుంచి తిరుపతిలోని కౌంటర్లలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శన టోకెన్లను ఇదివరకే జారీచేసిన విషయం తెలిసిందే. కాగా, సర్వదర్శనం టోకెన్లను జనవరి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి మంజూరు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అదేరోజు మధ్యాహ్నం 12 నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. పదిరోజులపాటు టీటీడీ వైకుంఠద్వార దర్శనాన్ని కల్పించగా.. భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లు కలిగిన భక్తులు ఆదివారం సాయంత్రానికి క్యూకాంప్లెక్స్‌లోని 13 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు ఐదుగంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శనివారం 63,728 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. శ్రీవారికి హుండీ కానుకలు రూ.3.70 కోట్లు లభించినట్లు చెప్పారు.