విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ 17 ఏళ్ల దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. తొలుత ప్రియుడు.. ఆ తర్వాత అతని స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడగా.. ఆ తర్వాత మరో 8 మంది ఆమెను హోటల్ గదిలో నిర్భందించి రెండ్రోజుల పాటు నరకం చూపారు. ఎలాగో అలా ఆ నరకం నుంచి తప్పించుకున్న బాలిక.. ఆ తర్వాత జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం విశాఖ కంచరపాలెం వచ్చింది. కుటుంబంలోని బాలిక రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. బాలికకు భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో అక్కడే పరిచయం ఏర్పడి ఆపై.. ప్రేమగా మారింది. డిసెంబర్ 18న ఆమెను ప్రియుడు విశాఖలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం తన స్నేహితుడినీ రప్పించి అఘాయిత్యానికి పురమాయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.
ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్కే బీచ్‌కు వెళ్లి రోధిస్తుండగా.. పర్యాటకుల ఫొటోలు తీసే ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓదార్చినట్లు నటించాడు. ఆపై జగదాంబ కూడలి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను బంధించి అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజులపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకున్న బాలిక ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటినుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.. డిసెంబర్ 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు.
మానసిక ఆందోళనతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం తల్లిదండ్రులకు చెప్పటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నగరానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నారు.