తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను ఐసీయూల్లో చేర్చుకునే విషయమైన కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రోగులు లేదా వారి బంధువులు నిరాకరిస్తే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆస్పత్రులు వారిని చేర్చుకోలేవని మార్గదర్శకాలలో పేర్కొంది. చికిత్స సాధ్యం కానప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు లేదా వ్యాధి లేదా రోగానికి చికిత్స కొనసాగించినా ప్రభావం చూపకపోతే ఐసీయూలో ఉంచడం వ్యర్థమని 24 మంది నిపుణులతో కూడిన కమిటీ రూపొందించిన ఈ మార్గదర్శకాలను సిఫార్సు చేసింది. అలాగే, మహమ్మారి లేదా విపత్తు పరిస్థితుల్లో వనరుల పరిమితంగా ఉన్నట్లయితే.. రోగిని ఐసీయూలో ఉంచడానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
రోగులను ఐసీయూలో చేర్చడానికి ప్రమాణాలు
అవయవాల వైఫల్యం, అవయవ మద్దతు అవసరం లేదా క్షీణిస్తోన్న పరిస్థితిని అంచనా వేయడంపై ఆధారపడి ఉండాలి. హేమోడైనమిక్ అస్థిరత, రెస్పిరెటరీ సపోర్ట్, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల అత్యవసర పర్యవేక్షణ లేదా అవయవ మద్దతు లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఐసీయూలో చేర్చాలి. కార్డియోవాస్కులర్ లేదా శ్వాసకోశ వ్యవస్థలో తీవ్ర ఇబ్బంది తలెత్తినా లేదా పెద్ద సర్జరీ చేయించుకున్న రోగులు కూడా ఈ ప్రమాణాలలో ప్రత్యేకించారు. ‘రోగి లేదా బంధువులు ఐసీయూలో చేరడానికి నిరాకరించడం.. పరిమితి చికిత్స కలిగి ఉన్న ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా... ఐసీయూ అవసరం లేనివారు.. మహమ్మారి లేదా విపత్తు సమయంలో వనరులు పరిమితంగా ఉన్నప్పుడు ఐసీయూలో చేర్చుకోరాదు’ అని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఐసీయూలో బెడ్ కోసం వేచి ఉన్న రోగిలో రక్తపోటు, పల్స్ రేటు, శ్వాసకోశ రేటు, శ్వాస విధానం, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ సంతృప్తత, మూత్రం విసర్జన ఇతర పారామితులతో పాటు నాడీ సంబంధిత స్థితిని పర్యవేక్షించాలి.