అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతోంది. ఇక ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిరానికి దేశ ప్రజలు తమ వంతు సాయం చేస్తున్నారు. అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులు అయోధ్యకు పంపిస్తున్నారు. ఇక రాముని తల్లి ఊరిగా భావించే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి భారీగా బియ్యం ట్రక్కులు బయల్దేరాయి. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర ఆహార పదార్థాలను అయోధ్యకు కానుకలుగా పంపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తంగా దాదాపు 300 టన్నుల బియ్యాన్ని భక్తులు అయోధ్యకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాముడి తల్లి స్వస్థలం అని భావిస్తున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్ మిల్లర్స్ అసోసియేషన్ సుగంధ భరిత బియ్యాన్ని పంపిస్తోంది. ఇక ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలను అక్కడి రైతులు అయోధ్యకు పంపిస్తున్నారు.
ఇక రాయ్‌పూర్‌లోని రామాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం నుంచి 300 మెట్రిక్ టన్నుల సుగంధ భరిత బియ్యంతో అయోధ్యకు బయలుదేరిన 11 ట్రక్కులకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీఎం విష్ణు దేవ్‌సాయి తన ట్విటర్‌లో ట్వీట్ చేశారు. రాముని దర్శనం కోసం ఆతృతగా వేచిచూస్తున్నామని.. జనవరి 22న అయోధ్యలో మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో రైతులు వారి పొలాల్లో పండించిన 100 టన్నుల కూరగాయలను అయోధ్యకు పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అయితే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి వచ్చేవారికి.. ఆ తర్వాత వచ్చే భక్తులకు అన్నదానం పెట్టేందుకు ఈ బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను వినియోగించనున్నారు. ఇక జనవరి 22 వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రోజు భక్తులందరికీ అన్నదానం చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది.