నెల్లూరు జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. శాసన మండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి దుర్మరణం పాలయ్యారు.ఎమ్మెల్సీకీ గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దగదర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి నెల్లూరుకు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలో దగదర్తి వద్ద.. చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పింది. అతి వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టింది. అటుగా వెళ్తోన్న లారీనీ ఢీ కొట్టిందా వాహనం.
లారీ టైర్లు పేలిపోయాయంటే కారు వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రశేఖర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. కారు మొత్తం నుజ్జునుజ్జయింది. అతి కష్టం మీద ఆయనను బయటికి తీయాల్సి వచ్చింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. అదే సమయంలో అదేమార్గంలో వెళ్తోన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కారులో చంద్రశేఖర్ రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలియడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారి మీద వాహనాల రాకపోకలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. సుమారు అరగంట పాటు హైవేపై రాకపోకలు ఆగిపోయాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు వాహనాల రాకపోకలను క్లియర్ చేశారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న వాహనాలన్నింటినీ తొలగించారు.