తన వ్యాఖ్యలు, ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఆయన బాంబు పేల్చారు. క్రిస్మస్ వేడుకల సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని పాల్ ఆరోపించారు. క్రిస్మస్ పండుగ వేళ టార్గెట్ చేసుకుని.. తనకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశారని పాల్ ఆరోపణలు చేయడం గమనార్హం. ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని కేఏ పాల్ వెల్లడించారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పాల్ చెప్పారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని ఆయన అన్నారు. ఈ విషయం చెప్పొచ్చో లేదోనని.. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని తెలిపారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని ఆయన వాపోయారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా చికిత్స తీసుకుంటున్నట్లు పాల్ చెప్పడం గమనార్హం. రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ ఆరోపణలు చేశారు. ఆయన చెప్పినట్లుగా ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తనపై విష ప్రయోగం జరిగిందని కేఏ పాల్ పేరుతో ఆడియో లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివి అనేకం ఉన్నాయి మెడికో ప్రీతి కేసు మొదలు గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినందుకు తనను టార్గెట్ చేశారని పలుసార్లు మీడియా ముందుకు వచ్చి ఆరోపించారు. చాలాకాలం తరువాత తిరిగి మరోసారి విషప్రయోగం అంటూ ఆడియో క్లిప్ విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.