ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఓటుపై వివాదం రేగింది. మంత్రి తప్పుడు చిరునామా ఇచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటును పొందారని టీడీపీ నేతలు ఆరోపించారు. అధికారులు ఆమె ఓటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాంప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఎల్లావుల అశోక్‌లు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్‌వో లక్ష్మీశివజ్యోతికి ఫిర్యాదు చేశారు. తప్పుడు చిరునామా ఇచ్చినందుకు ఓటును రద్దు చేయాలని ఫాం-7ను కనపర్తి శ్రీనివాసరావు ఎన్నికల విభాగంలో అందజేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా నియమితులైన మంత్రి విడదల రజిని ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారన్నారు టీడీపీ నేతలు. చిలకలూరిపేట నియోజకవర్గం పురుషోత్తంపట్నంలో ఎపిక్ నంబరు ఎస్‌జీఈ1201169తో ఉన్న ఓటును బదిలీ కోరుతూ పశ్చిమ నియోజకవర్గం శ్యామలానగర్ రెండోలైన్‌లోని ఇంటి నంబరు 9-2-98, సాయిగ్రాండ్ అపార్టుమెంట్, ఫ్లాట్‌నం 101 చిరునామాతో కల్పించాలని డిసెంబరు 22న మంత్రి దరఖాస్తు చేశారని చెప్పుకొచ్చారు.
డిసెంబరు 29న ఎన్నికల విభాగం అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారని.. ఈ ఇంటినంబరులో వాస్తవానికి ఖాళీస్థలం ఉండగా సాయిగ్రాండ్ అపార్టుమెంట్ ఉన్నట్లు చిరునామాలో పొందుపరిచారన్నారు. మంత్రి కావడం వల్లే పరిశీలన చేయకుండా ఓటు కల్పించడానికి ప్రాసెస్ చేశారని.. ఎన్నికల ప్రక్రియను మంత్రి రజిని తప్పుదోవ పట్టించినందున ఓటు రద్దు చేసి సదరు బీఎల్వోను సస్పెండ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. సాయిగ్రాండ్ అపార్టుమెంట్ ఖాళీస్థలానికి అతి సమీపంలోనే ఉందంటున్నారు టీడీపీ నేతలు. అందులో మంత్రి భర్త కుమారస్వామి పేరిట 101 ఫ్లాట్ కొనుగోలు చేశారని.. ప్రస్తుతం మంత్రి పట్టాభిపురంలోని వేరే అపార్టుమెంట్‌లో నివసిస్తున్నారన్నారు. మంత్రి నివాసం లేని చిరునామాతో ఓటు మంజూరుకు ప్రాసెస్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందించారు.. మంత్రి రజిని సొంతింటి చిరునామాతోనే ఓటు పొందారన్నారు. దీంతో గుంటూరులో మంత్రి విడదల రజిని ఓటుపై వివాదం రేగింది. టీడీపీ అభ్యంతరాలపై అధికారులు ఎలా స్పందిస్తారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మంత్రి విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆమెను చిలకలూరిపేటలో కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా ఇటీవల నియమించారు. ఈ క్రమంలోనే మంత్రి రజిని తన ఓటును గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై మంత్రి స్పందించాల్సి ఉంది.