ఓ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే నివాసంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్వహించిన మెరుపు సోదాల్లో గుట్టలుగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి బయటపడింది. అంతేకాదు, ఖరీదైన మద్యం, అధునాతన విదేశీ ఆయుధాలను చూసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోరెళ్లబెట్టారు. హరియాణాలో అక్రమ మైనింగ్ వ్యవహారం ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్, మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
గురువారం ఉదయం ఆరు వాహనాల్లో వచ్చిన 15 నుంచి 20 మంది ఈడీ సిబ్బంది.. సురేంద్ర పన్వార్ నివాసం, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఐఎన్ఎల్డీ నేత దిల్‌బాగ్ సింగ్ ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, ఛండీగఢ్, కర్నాల్‌లో ఏకకాలంలో జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల నగదు, ఆస్తులు బయటపడ్డాయి. విదేశాల్లో తయారైన తుపాకులు, 100 మద్యం బాటిళ్లు, మూడు కిలోల బిస్కెట్ల సహా ఐదు కిలోల బంగారం, వెండిని అధికారులు గుర్తించారు.
గురువారం ఉదయం మొదలైన ఈ తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించినా యమునానగర్, చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నట్టు హరియాణా పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. దీంతో 2013లో దీనిపై ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టింది. రాయల్టీల సేకరణను సులభతరం చేయడానికి, పన్ను ఎగవేతను నిరోధించడానికి హరియాణా ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన ‘ఈ-రవాణా’ పథకాన్ని నిందితులు హైజాక్ చేసి నకిలీది నడుపుతున్నారని ఈడీ ఆరోపిస్తోంది.