తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. నంద్యాల–కడప మధ్య నడిచే డెమో ప్యాసింజర్ రైలును పొడిగించారు. 07284/07285 నంబరుతో నడుస్తున్న డెమోను పొడిగించాలనే ప్రతిపాదనకు ఏడాది తర్వాత రైల్వేశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారు తిరుపతి వైపు వెళ్లేందుకు అనువుగా ఉంటుందనే డెమోను రేణిగుంట వరకు పొడిగించే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇవాళ రేణిగుంటలో నంద్యాల–డెమో రైలు పొడిగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు రైల్వేశాఖ సన్నద్ధమవుతోంది.. అంతేకాదు వివిధశాఖల అధికారులకు తొలిరోజున విధులు కేటాయింపులు కూడా చేశారు. నంద్యాల–కడప డెమో ప్యాసింజర్ రైలును పొడిగింపు చేసే టైమింగ్స్ ఇలా ఉన్నాయి. నంద్యాలలో 5.50కు బయలుదేరి కడపకు 9.40కి చేరుతుంది. 9.45కు కడపలో బయలుదేరి రేణిగుంటకు 1.30 గంటలకు చేరుతుంది. రేణిగుంటలో తిరిగి 2.30కు బయలుదేరి కడపకు 5.30 కు చేరుతుంది. నంద్యాలకు 9.30కు డెమో చేరుకునేలా టైమింగ్స్ మార్చారు. స్టాపింగ్‌స్టేషన్ల ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు బాలపల్లెలు ఉన్నాయి.
తిరుపతి వెళ్లేవారి కోసం వెంకటాద్రి, రాయలసీమ, కోల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.. కానీ ప్యాసింజర్ రైలు ఒక్కటి కూడా లేదు. గతంలో స్టీమ్ ఇంజిన్ లోకోలతో రైళ్లు నడిచే కాలంలోనే కడప నుంచి తిరుపతికి ప్యాసింజర్ (93,94నంబర్లతో) ఉదయం పూట నడిచేవి. కానీ ఆ తర్వాత నడవలేదు. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలవాలసులు తిరుపతికి వెళ్లేందుకు అనువుగా ఈ డెమో ప్యాసింజర్ రైలు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే ఈ రైలును రేణిగుంట వరకే నడిపిస్తున్నారు. కానీ భక్తులతో పాటు నిత్యం విద్యార్ధులు, ఉద్యోగులు, అధికారులు వి ధుల నిర్వహణ నిమిత్తం తిరుపతికి వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. అందుకే ఈ రైలును తిరుపతి వరకు పొడిగిస్తే ఉపయోగకరంగా ఉంటుందని మరోసారి కోరుతున్నారు. నంద్యాల, కర్నూలుతో పాటుగా ఉమ్మడి కడప జిల్లాకు చెందిన భక్తులు నేరుగా తిరుపతికి వెళ్లేందుకు వీలుగా డెమో నడపాలని డిమాండ్ చేస్తున్నారు.