మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి.. అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని గద్దె దించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఆ వ్యూహాలను తిప్పి కొట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కూడా ప్రతివ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సంక్రాంతి పండగ నుంచి లోక్‌సభ ఎన్నికలకు కమలం పార్టీ శంఖారావం పూరించనుంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభతో సార్వత్రిక ఎన్నికల సమరాన్ని జనవరి 13 వ తేదీన ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే జనవరి 13 వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బిహార్‌లోని బెతియాలో జరగనున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు కాషాయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
అయితే బిహార్‌లో గతేడాది బీజేపీతో పొత్తు తెంచుకుని నితీశ్ కుమార్.. ఆర్జేడీతో కలిసి అధికారాన్ని చేపట్టడంతో ఆ రాష్ట్రంపై బీజేపీ గురి పెట్టింది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని 40 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ విస్తృత ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బిహార్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జనవరి 13 వ తేదీ నుంచి బెతియా, బెగుసరాయ్, ఔరంగాబాద్ బహిరంగ సభలతో ముమ్మర ప్రచారం చేపట్టనుంది. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు తెలిపాయి.
మరోవైపు.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు కూడా వచ్చే 2 నెలల్లో బిహార్‌లో అనేక సభల్లో పాల్గొననున్నారు. జనవరి 15 వ తేదీ తర్వాత ముమ్మర ప్రచారం ఉంటుందని కాషాయ వర్గాలు అనుకుంటున్నాయి. సీతామఢి, మధేపురా, నలందాల్లో అమిత్‌షా పాల్గొననుండగా సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పడిన ఇండియా కూటమి కూడా ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ఇండియా కూటమిలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇండియా కూటమి కన్వీనర్‌గా కూడా నితీశ్ కుమార్ ఉంటారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్రం నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.