భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు.. తమ టూర్‌లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు.. భారత్‌పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ తాజాగా వెల్లడించారు. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీతో పాటుగా భారత్ లక్ష్యంగా ఇష్టారీతిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మాల్దీవులుకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. నెటిజన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని మోదీ సూచించారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్‌పై, ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇక మాల్దీవుల మంత్రి మరియం షియునా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని క్లౌన్ జోకర్, తోలుబొమ్మగా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.