అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న భవ్య రామమందిరం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయోధ్యలో కొలువైన రామ మందిరంలో దైవత్వం, వైభవం, నూతనత్వం నిండుగా కనిపిస్తాయని తెలిపారు. వీటితోపాటు శ్రీరాముని మహా మందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రీయ శక్తులు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఏటా శ్రీరామనవమి నాడు అయోధ్య రామ మందిరంలో అద్భుతం జరుగుతుందని చెప్పారు.
ప్రతీ ఏటా శ్రీరామనవమి రోడు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునికి తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతీ సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం 9 వ రోజన సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా అయోధ్య రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్టే రాముడి విగ్రహం పొడవు, ఎత్తును రూపకల్పన చేశారు. శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని పేర్కొన్నారు.
ముగ్గురు కళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారని.. అందులో ఒక విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు చంపత్‌రాయ్ తెలిపారు. ఆ విగ్రహం పొడవు 51 అంగుళాలు ఉంటుందని.. బరువు 1.5 టన్నులు ఉందని చెప్పారు. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని వివరించారు. ఇక జనవరి 16 వ తేదీ నుంచి అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. జనవరి 18 వ తేదీన గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముడిని ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు. ఈ విగ్రహాన్ని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకపోవడం.. దీనికి ఉన్న మరో ప్రత్యేకత అని పేర్కొన్నారు.
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన జరిగే జనవరి 22 వ తేదీన దేశవ్యాప్తంగా 5 లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని తెలిపారు. సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం 5 దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్ కోరింది. జనవరి 26 వ తేదీ తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని సూచించారు. రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.