దేశ రాజధాని ఢిల్లీలోని స్కూళ్లకు శీతాకాల సెలవులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మరో 5 రోజులు పొడిగించింది. చలి గాలుల తీవ్రత తగ్గకపోవడం, పొగమంచు భారీగా ఏర్పడుతుండటంతో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఇప్పటివరకు ప్రకటించిన సెలవులను ఈ నెల 12 వ తేదీ వరకు వరకు పొడిగించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొదట ప్రకటించిన సెలవుల ప్రకారం నేటి (ఆదివారం) వరకు స్కూళ్లకు సెలవులు ఉండగా.. తాజా పెంపుతో అది 12 వ తేదీకి పెరిగింది.
అయితే మొదట ఇచ్చిన సెలవులు పూర్తి కానున్న వేళ.. ఢిల్లీ ప్రభుత్వం సెలవుల పొడిగింపుపై ఇచ్చిన ఆదేశాల్లో గందరగోళం నెలకొంది.
ప్రస్తుతం ఢిల్లీలోని పాఠశాలలకు ఉన్న సెలవులను ఈనెల 10 వ తేదీ వరకు పొడిగిస్తూ శనివారం.. ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. సెలవుల పొడిగింపునకు సంబంధించి తీసుకున్న నిర్ణయంలో చిన్న పొరపాటు జరిగిందని.. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ తాజాగా సెలవుల పొడిగింపుపై స్వయంగా విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటన చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత తీవ్రంగా కొనసాగుతోంది. పొగమంచు కారణంగా విజబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యుడు కూడా చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటున్నాడు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని సర్వీసులను రద్దు చేయగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలలకు శీతాకాలపు సెలవులు పొడిగించాలని ఢిల్లీ విద్యాశాఖ నిర్ణయం తీసుంకుంది.