అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశమే కాకుండా వివిధ దేశాల్లో ఉన్న కోట్లాది మంది హిందువులు ఎన్నో రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22 వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభోత్స అపూర్వ ఘట్టం జరగనుంది. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ముస్లిం మత సంస్థ అధినేత, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ప్రారంభోత్సవం జరిగే 5 రోజుల పాటు దేశంలో ఉన్న ముస్లింలు అందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని బద్రుద్దీన్ అజ్మల్ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు బద్రుద్దీన్ అజ్మల్. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 20 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ముస్లింలు ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ముస్లింలకు బీజేపీ అతి పెద్ద శత్రువుగా బద్రుద్దీన్ అజ్మల్ అభివర్ణించారు. ముస్లింల జీవితాలు, విశ్వాసం, ప్రార్థనలు, మదర్సా, మసీదు, ఇస్లామిక్, ఆజాన్‌కు బీజేపీ పూర్తి వ్యతిరేకమని తెలిపారు.
అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నందున ఈ నెలలో ముస్లింలు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు. రామ జన్మభూమిలో రామ్ లల్లా విగ్రహాం నెలకొల్పే సమయం కోసం.. ఆ తర్వాత రామ్ లల్లాను దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా అయోధ్యకు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ముస్లింలు అందరూ శాంతియుతంగా ఉండాలని బద్రూద్దీన్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ తీవ్ర స్థాయిలో ఖండించింది. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది బీజేపీ విధానమని స్పష్టం చేసింది. తమ పార్టీ ముస్లింలను ద్వేషించేది కాదని తేల్చి చెప్పింది. గతంలో అయోధ్య భూ వివాదంలో పిటిషన్ వేసిన ఇక్బాల్ అన్సారీకి కూడా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆలయ ట్రస్ట్ ఆహ్వానం పంపిన విషయాన్ని గుర్తు చేసింది. బద్రుద్దీన్ అజ్మల్, అసదుద్దీన్ ఒవైసీ లాంటి వారు మాత్రమే ముస్లింలలో ద్వేషం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడింది. ముస్లింలు అంటే బీజేపీకి ద్వేషం లేదని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా బద్రుద్దీన్ మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.