మొబైల్ ఫోన్ సహా ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటేనే దొరకడం అసాధ్యం. అటువంటిది ఎయిర్‌పాడ్స్ పోతే వాటిపై ఆశ వదులుకోవాల్సిందే. కానీ ఓ యువకుడు మాత్రం తన వస్తువు పోయింది కదా అని లైట్ తీసుకోలేదు. వాటిని ఎలాగైనా తిరిగి పొందాలనుకుని చివరకు అనుకున్నది సాధించాడు. ముంబయికి చెందిన నిఖిల్ జైన్ అనే యువకుడు కేరళ పర్యటనకు వెళ్లాడు. అక్కడే తనకు ఎంతో ఇష్టమైన యాపిల్ ఎయిర్‌పాడ్స్ పోగొట్టుకున్నాడు. అయితే, తన చేజారిపోయిన వాటిని తిరిగి చేజిక్కించుకోవాలని అనుకున్నాడు. ఇందుకు సోషల్ మీడియా సాయం తీసుకున్నాడు.
ఈ మేరకు అతడు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ‘డిసెంబరు 21న నేను కేరళలో ఓ జాతీయ పార్కు సందర్శనకు వెళ్లినప్పుడు బస్సులో ఎయిర్‌పాడ్స్ పోగొట్టుకున్నా. సిగ్నల్స్ లేకపోవడంతో అప్పుడు ట్రాక్ చేయలేకపోయా.. వేరే ప్రాంతానికి వచ్చి ట్రాక్ చేయగా.. ఆ ప్రదేశానికి అవి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించాను.. ఎవరో వాటిని తీసుకున్నారని గ్రహించాను.. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కచ్చితమైన ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయారు.. మళ్లీ ట్రాకింగ్ చేయడంతో రెండు రోజులుగా అవి దక్షిణ గోవాలో ఉన్నాయి.. వాటిని తీసుకున్న వ్యక్తి గోవా వాసి అయిండాలి. మీలో ఎవరైనా గోవాలో ఉంటే నాకు సాయం చేయగలరా?’ అంటూ రిక్వెస్ట్ చేశాడు.
ఆ అడ్రస్, గూగుల్ స్ట్రీట్ మ్యాప్‌ని పోస్ట్‌కు జతచేయడంతో నిఖిల్ ట్వీట్‌కి తక్కువ సమయంలోనే మిలియన్ల వ్యూస్ వచ్చి వైరల్ అయింది. సంకేత్ అనే ఓ నెటిజన్ ‘మా బంధువులకి వివరాలు పంపాను.. మార్మగోవా పోలీస్ స్టేషన్‌లో మీ ఎయిర్ పాడ్స్ అందిస్తారు. వచ్చి తీసుకోవచ్చు’ అంటూ సమాధానమిచ్చాడు. దీంతో నిఖిల్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. గోవాకు వెళ్లిన తన స్నేహితుడి సాయంతో వాటిని తెప్పించుకుని, తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం షేర్ చేశాడు.