అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తం సమీపిస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక, గర్బాలయంలో ప్రతిష్ఠించే విగ్రహం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహం 51 అంగుళాల పొడవు, 1.5 టన్నుల బరువు ఉంటుందని తెలిపారు. ఐదేళ్ల పసి బాలుడి రూపంలోని అమాయకత్వంతో, దైవత్వం ఉట్టిపడే విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు.
ఏటా చైత్రశుద్ధ నవమి నాడు సూర్య భగవానుడే స్వయంగా శ్రీరాముడి విగ్రహాన్ని తన కిరణాలతో అభిషేకిస్తాడని, ఆ రోజున సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆయోధ్య ఆలయంలో కొలువైన విగ్రహం నుదిటిపై భానుడి కిరణాలు నేరుగా పడి ప్రకాశిస్తాయని ఆయన పేర్కొన్నారు. విగ్రహం, దానిని ప్రతిష్ఠించే సింహాసనం ఎత్తు విషయంలో దేశంలోని ప్రముఖ అంతరిక్ష, ఖగోళ శాస్త్రవేత్తల సలహాలు, సూచనల తీసుకున్నామని చెప్పారు. వారి అభిప్రాయానికి అనుగుణంగా వీటిని డిజైన్ చేసినట్టు వివరించారు. దక్షిణ భారతంలోని ఆలయాల స్ఫూర్తితో రామమందిర నిర్మాణం చేపట్టామని చంపత్ రాయ్ వివరించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 తనకు ఎంత ముఖ్యమో, 2024 జనవరి 22 కూడా అంతే ముఖ్యమని రాయ్ చెప్పారు. ఆ రోజున దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షలకుపైగా దేవాలయాల్లో పూజలు నిర్వహించి, ఘనంగా వేడుకలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, జనవరి 26 తర్వాతే ఆలయ సందర్శనకు అయోధ్యకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, జనవరి 22న జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ వేడుకను ప్రజలందరూ వీక్షించడమే లక్ష్యంగా బూత్ స్థాయిలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, మందిర ప్రతిష్ఠను పురస్కరించుకొని అయోధ్య నుంచి రామజ్యోతిని కాశీకి తెచ్చేందుకు వారణాసికి చెందిన నజీన్ అన్సారీ, నజ్మా పర్వీన్ అనే ముస్లింలు ముందుకొచ్చారు. ఆ జ్యోతిని చేతబట్టి ఊరూరా తిరుగుతూ శ్రీరాముడు తమ పూర్వీకుడని, ప్రతి భారతీయుడి డీఎన్‌ఏ ఒక్కటేననే సందేశాన్ని వ్యాప్తి చేయనున్నారు.