ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ పదే పదే తనకు సమన్లు జారీ చేస్తున్న వేళ.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఎలాంటి సమాచారాన్ని అడిగినా ఇవ్వకూడదని జార్ఖండ్ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు అడిగే ప్రశ్నలను క్యాబినెట్ సెక్రటరీ లేదా విజిలెన్స్ శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని జార్ఖండ్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ క్రమంలోనే జార్ఖండ్ సీఎం ప్రధాన కార్యదర్శి వందనా దడేల్ ఒక లేఖను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇచ్చే నోటీసులకు నేరుగా అధికారులు సమాధానం ఇవ్వరాదని.. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ లేఖలో పేర్కొన్నారు. అలా ఇస్తే సమాచారం అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో ఉందని.. ఆ ఏజెన్సీ తమ శాఖకు నేరుగా రిపోర్టు చేస్తుందని వందనా దడేల్ పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అధికారికి ఈడీ, సీబీఐ, ఐటీ నుంచి లేఖ వస్తే.. వాళ్లు తమ ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆ లేఖలో వెల్లడించారు.
అయితే ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ అధికారులు 7 సార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఆ సమన్లను పట్టించుకోని హేమంత్ సోరెన్ విచారణకు హాజరు కాలేదు. జార్ఖండ్‌లో ప్రస్తుతం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ మేజర్ భాగస్వామిగా కొనసాగుతోంది. అయితే ఇండియా కూటమిలోని పార్టీలు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించవద్దని తీర్మానించుకున్న నేపథ్యంలో జార్ఖండ్‌లో ఈ తరహా ఆదేశాలను హేమంత్ సోరెన్ జారీ చేశారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.