దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ జేఎన్ 1 కారణమని, రాబోయే రోజుల్లో ఇది ప్రబలంగా మారుతుందని సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) డేటా సూచిస్తోంది. తూర్పు ప్రాంతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ మాత్రమే వేరియంట్ కేసులు నమోదైనట్టు వెల్లడించాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో ఇది తన ఉనికిని ఏర్పరచుకుంది. దీని ప్రాబల్యం దక్షిణాదిలో అత్యధికంగా ఉందని, తరువాత ఉత్తర, పశ్చిమ ప్రాంతాలు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
డిసెంబర్ చివరి వారంలో ఇన్‌సాకాగ్ ల్యాబ్‌లలో పరీక్షించిన కోవిడ్-పాజిటివ్ శాంపిల్స్‌లో తూర్పు ప్రాంతంలో కేవలం 28.6% మాత్రమే జేఎన్.1 వేరియంట్‌కు చెందినవి ఉండగా.. దక్షిణాదిలో 100% ఉన్నాయి. దేశంలో జేఎన్.1 రకం వేరియంట్‌ను డిసెంబరు 17న కేరళలో మొదటిసారి గుర్తించారు. తిరువనంతపురం జిల్లాలో 79 ఏళ్ల మహిళ జలుబు, జ్వరం వంటి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా.. ఆమెకు నిర్వహించిన ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమె నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా.. కొత్త వేరియంట్ బయటపడింది.
అప్పటి నుంచి జేఎన్.1 రకం కేసుల్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కొనసాగుతున్నప్పటికీ డిసెంబర్ 2023 నుంచి 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 536 జేఎన్.1 కేసులను గుర్తించినట్లు జనవరి 7 నాటి Insacog డేటా సూచించింది. ఇందులో 154 కేసులతో కేరళ తొలిస్థానంలో ఉండగా.. తర్వాత మహారాష్ట్ర (111), గుజరాత్ (76), గోవా (51), రాజస్థాన్, తెలంగాణల్లో 32 చొప్పున, ఏపీలో 29, తమిళనాడులో 22, ఢిల్లీ 16, కర్ణాటక 8, ఒడిశా 3, పశ్చిమ్ బెంగాల్ 2 కేసులు ఉన్నాయి. డిసెంబరు చివరి వారంలో ఉత్తర ప్రాంతంలోని ఇన్‌సాకాగ్ ల్యాబ్‌లలో అన్ని కోవిడ్-పాజిటివ్ శాంపిల్స్‌లో జేఎన్.1 కేసులు 83.3%, పశ్చిమ ప్రాంతంలో 73.1% ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో బీఏ.2 వేరియంట్ల కలయికతో ఏర్పడిన , ఎక్స్బీబీ.1.16 57.1% కేసులతో ఆధిపత్యం చెలాయించింది. ఓమిక్రాన్ సబ్-వేరియంట్ బీఏ.2.86 లేదా పిరోలా వంశానికి చెందిన జేఎన్.1 వేగవంతమైన వ్యాప్తి ప్రస్తుతం వేగంగా ఉంది. దీని స్పైక్ ప్రోటీన్‌లోని ఒక కొత్త మ్యుటేషన్ దాని పేరెంట్ స్ట్రెయిన్‌కు భిన్నంగా ఉంటుంది. ఇది మానవ శరీర రోగనిరోధక ప్రతిస్పందనను తప్పించుకోవడానికి సహకరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని పెంచుతుంది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279.. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,049కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ఆరుగురు కరోనా కారణంగా మృతి చెందారు. మరో 889 మంది కరోనా నుంచి కోలుకున్నారు.