రాష్ట్రంలో మార్చాల్సింది దొంగల ముఠా నాయకుడైన ఆలీబాబానేనని దొంగలను కాదని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దేవినేని ఉమా అన్నారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న తిరువూరు టీడీపీ నాయకులను పరామర్శించేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మారుస్తూ ప్రజావ్యతిరేకతను అధిగమించాలని సీఎం జగన్ చూస్తున్నారని వాస్తవంగా మార్చాల్సింది దొంగలను కాదని, ఆ దొంగల ముఠా నాయకుడైన ఆలీబాబాను అని అన్నారు. తండ్రి సీఎంగా ఉన్నప్పుడే ఈడీ లెక్కల ప్రకారం రూ. 43 వేల కోట్లను దోచుకున్నట్లుగా తేల్చి లెక్కలు లేని రూ. 43 వేల కోట్ల ఆస్తిని జప్తు చేశారన్నారు. ఇప్పుడు సీఎంగా దోచుకున్న సొమ్ము కక్కించాలంటే ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మద్య నిషేధం అన్న జగన్‌రెడ్డి పెట్టిన నూతన మద్యం బ్రాండ్‌లతో రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారన్నారు. ప్రతిరోజూ సరాసరిన ముగ్గురు పిచ్చిబ్రాండ్‌లు తాగి చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలు, మున్సిపల్ వర్కర్లు, ఆశాలు, ఉపాధ్యాయులు చివరికి ఆయన నియమించిన వలంటీర్లు కూడా జగన్‌రెడ్డిని ఛీ కొడుతున్న సందర్భాలు నేడు చూస్తున్నామన్నారు. దొంగ ఓట్లతో గట్టెక్కుదామని జగన్ చూస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఓటు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. 200 యూట్యూబ్ ఛానెళ్ళ ద్వారా 100 రోజుల్లో తన అవినీతి డబ్బును వెదజల్లి దుష్ప్రచారం చేసి ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలవాలని జగన్‌రెడ్డి చూస్తున్నాడని, దీనిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఎన్ని ఎత్తులు వేసినా జగన్‌కు పరాభావం తప్పదని, వచ్చేది టీడీపీ–జనసేన కూటమి ప్రభుత్వమేనన్నారు. తిరువూరు టీడీపీ ఇన్‌చార్జ్ సేవల దత్తు తదితరులు పాల్గొన్నారు.