జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు తాను మంగళగిరి పార్టీ ఆఫీసులో కలిసి ముఖ్య అంశాలపై రెండు గంటల సేపు చర్చించాను... ఈ చర్చలో సీట్ల సర్దుబాబు, అధికార పంపిణీ ఉమ్మడి మేనిఫెస్టోలో చర్చించాల్సిన వివిధ పథకాలు.. పవన్ కళ్యాణ్ స్వంతంగా పోటీ చేయాల్సిన నియోజకవర్గ వివరాలు, తెలుగుదేశం, బీజేపీతో కూడా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకతలపై సవివరంగా చర్చించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు దక్కిన నియోజకవర్గాల సీట్లు వివరాలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లినట్టు చెప్పారు.
‘2019 ఎన్నికల్లో 10 వేల ఓట్లు వరకు దక్కించుకొన్న అభ్యర్థుల సంఖ్య 61 కాగా, 15 వేల ఓట్లు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య 40 వరకు ఉన్న విషయాన్ని చర్చించామని హరిరామ జోగయ్య చెపపారు. ఈ ప్రాతిపదికన జనసేన 40 నుంచి 60 వరకు సీట్లను ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పానని అన్నారు. ఈ సందర్బంగా 40 సీట్లకు తగ్గకుండా జనసేన పోటీచేయడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తానని పవన్ చెప్పినట్టు వివరించారు. అధికారం పంపిణీ విషయంలో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనే జనసైనికులు ఆకాంక్ష పవన్ ముందు పెట్టానని చెప్పారు. అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడే కనీసం రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటారని నమ్మినప్పుడే జనసేన ఓట్లు టీడీపీకి సవ్యంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని, 2019 ఎన్నికల్లో ఎదురైన ఫలితాలే వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినట్టు తెలిపారు.
దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అధికార పంపిణీ సవ్యంగా, జన సైనికుల గౌరవానికి ఎటువంటి భంగం కలుగకుండా జరగాలనే తాను కూడా ఆశిస్తున్నానని చెప్పి, ముందు ముందు ఈ విషయం లో స్పష్టత వస్తుందని సమాధానం ఇచ్చినట్టు హరిరామ జోగయ్య పేర్కొన్నారు. జనసేన పోటీచేసే నియోజకవర్గ వివరాలను ముందుంచినట్టు చెప్పింది. ‘కొణిదెల కుటుంబం స్వంత నియోజకవర్గం నర్సాపురం ఒకటయితే, పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత మేరకు భీమవరం నియోజకవర్గం రెండోది.. 2009 ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం అభ్యర్థి నెగ్గిన ఒకే ఒక నియోజక వర్గంన తాడేపల్లిగూడెం మూడోది... ఈ మూడు నియోజకవర్గాల లోటుపాటులను ఆయన దృష్టికి తీసుకొని రావడం జరిగింది’ అని ఆయన అన్నారు.