తమ పార్టీ టికెట్లు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వొద్దని తమకు చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయన్న ఆయన.. చంద్రబాబు రాష్ట్రమంతటా తిరిగి వైఎస్సార్సీపీలో ఎవరికి టికెట్ ఇవ్వాలి.. ఎవరిని ఎక్కడ నిలబెట్టాలని ఆయన చెబితే మేం వినాలన్నట్టుగా మాట్లాడుతున్నాడని సిద్ధార్థ్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌కు అన్ని విషయాలు తెలుసన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకొచ్చిన నాటి నుంచి జగన్‌కు రాజకీయాల పట్ల పూర్తి స్పష్టత ఉందన్నారు. అబద్దపు హామీలు ఇవ్వడం ఇష్టంలేకే 2014లో జగన్ అధికారంలోకి రాలేకపోయారన్నారు. ప్రజల జీవితాలను మార్చే నవరత్నాలతో అధికారంలోకి వచ్చాడన్నారు. జగన్ క్షేత్ర స్థాయి నుంచి వచ్చాడని.. ప్రజలకు ఏం కావాలో ఆయనకు తెలుసన్నారు. ఎక్కడ ఎవరితో పోటీ చేయించాలనే విషయంలో జగన్‌కు క్లారిటీ ఉందన్నారు.
పవన్ కళ్యాణ్‌పై, బీజేపీ పెద్దలపై చంద్రబాబు నాయుడు ఆధారపడ్డాడని బైరెడ్డి సిద్దార్థ్ వ్యాఖ్యానించారు. ఒక పక్క బీజేపీ వాళ్లతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. జగన్ గురించి, షర్మిల గురించి ఎలా మాట్లాడాలనే విషయంతో మీ దూతలతో రేవంత్ రెడ్డికి చెప్పి పంపిస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. ‘‘దేశంలో ప్రధాన శత్రువులైన బీజేపీని, కాంగ్రెస్‌ను చెరో సంకలో పెట్టుకొని నడుపుదామని అనుకోవడం చంద్రబాబు గొప్పతనం. మా బాషలో చెప్పాలంటే ఇంత బ్రోకర్ టాలెంట్ ఎవరి దగ్గరా ఉండదు. చంద్రబాబు మేనేజింగ్ స్కిల్స్ దేశంలో ఇంకెవరికీ రావు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీలో జగన్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదనే ఫేక్ ప్రచారం జరుగుతోంది. కానీ గ్రామాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది.
తెలంగాణలో గత ప్రభుత్వం చేసిన పనులకు.. ఏపీలో జగన్ సర్కారు చేసిన పనులకు ఎంతో తేడా ఉంది. ఏపీలో ప్రభుత్వ స్కూల్లో అడిష్మన్లు ఫుల్ అయ్యాయనే బోర్డు పెట్టారు.. ఇది పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడాలు చెప్పాలంటే రోజులు సరిపోవు. ఏపీలో అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించి, వాటిని అమ్ముకునే హక్కును కూడా వారికి కల్పించారు. కానీ తెలంగాణలో ప్రభుత్వమే అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంది. హైదరాబాద్‌లో వరదలొస్తే.. నాటి ప్రభుత్వం.. కేసీఆర్, కేటీఆర్ వరద బాధితుల కుటుంబాలకు పదివేల చొప్పున ఇస్తే.. సగం అధికారులు, నాయకులే తిన్నారు. కానీ ఏపీలో బెనిఫీషియరీకి డబ్బులు ఇవ్వాలంటే.. నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతోంది. ఎక్కడా అవినీతి జరిగే అవకాశం లేదు’’ అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘‘మేం రూ.2 వేలు పెన్షన్లు ఇస్తామని ప్లీనరీలో చెబితే రాష్ట్రం దివాళా తీస్తుందని చంద్రబాబు చెప్పారు. కానీ ఎన్నికల ముందు ఆయన పెన్షన్‌ను రూ.2 వేలు చేశారు. పెన్షన్ల కోసం ఎదురు చూసే పరిస్థితిని తప్పించారు. యువకులను ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 1.25 లక్షల మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు కల్పించాం. చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు..?’ అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రశ్నించారు. ఐదేళ్లలో ఏడాదిన్నర కాలం కోవిడ్‌తోనే సరిపోయిందన్న బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. ఆ టైంలోనూ సంక్షేమ పథకాలను జగన్ సర్కారు ఆపలేదన్నారు.