టీడీపీ అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల.. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా షర్మిలకు చంద్రబాబు దంపతులు స్వాగతం పలికారు. షర్మిల కుమారుడు రాజా రెడ్డి, ప్రియా అల్లూరి ప్రేమ వివాహం వచ్చే నెల 17న జరగనుండగా.. ఈనెల 18న నిశ్చితార్ధం జరగనుంది. ఈ వేడకకు రావాల్సిందిగా.. ఇప్పటికే షర్మల తన అన్న, ఏపీ సీఎం జగన్‌తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై పలువురు మంత్రులు, కాంగ్రెస్ అగ్ర నేతలకు ఆహ్వాన పత్రికలు స్వయంగా అందించారు.
తాజాగా చంద్రబాబును కూడా తన కుమారుడి వివాహా వేడకకు ఆహ్వానించడం ఆసక్తిగా మారింది. ఇటీవల క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నారా లోకేష్‌కు వైఎస్ షర్మిల పంపిన గిఫ్ట్, గ్రీటింగ్స్‌కు లోకేష్ థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబును కలిసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. తన కుమారుడి వివాహ వేడుకకు హాజరు కావాలని తాను చంద్రబును కోరినట్లు తెలిపారు. ఆయన తప్పకుండా వస్తానని చెప్పినట్లు షర్మిల వెల్లడించారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం, సాన్నిహిత్యం, వాళ్లు అప్పట్లో కలిసి తిరిగిన రోజులను చంద్రబాబు గుర్తు చేశారన్నారు. అంతే తప్ప పొలిటికల్ విషయాలు మాట్లాడలేదని.. జస్ట్ తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇవ్వటానికే వెళ్లినట్లు చెప్పారు.
'వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను. వైఎస్‌తో ఉన్న స్నేహం గురించి చాలా సేపు చర్చ జరిగింది. వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు. చంద్రబాబును కలవటాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు. నేను చంద్రబాబుకే కాదు అందరికీ పంపా. కేటీఆర్, హరీష్, కవిత గారికి కూడా పంపా. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్.
రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం. కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే. అందరం ప్రజల కోసమే పని చేయాలి. పండుగకో, లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాం. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు. వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబును పిలిచారు. మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి వచ్చారు..దీవించారు.' అని షర్మిల వెల్లడించారు. కాగా, ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తన పాత్రకు సంబంధించిన నిర్ణయాన్ని అదిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని..ఆయన ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుందన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యమని షర్మిల చెప్పారు.