ఆర్థిక వృద్ధి, రాజకీయ స్థిరత్వం, అంతర్జాతీయంగా డిమాండ్, సహజ వనరులు.. ఇవన్నీ ఒక దేశ కరెన్సీ విలువను, బలాన్ని నిర్ణయిస్తుంటాయి. అయితే ప్రపంచ దేశాల్లో టాప్ కరెన్సీ ఏదంటే ఠక్కుమని అంతా యూఎస్ డాలర్ అని చెబుతుంటారు. అయితే ఇది కానే కాదు. కనీసం రెండులోనో, మూడులోనో కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యంత బలమైన కరెన్సీల లిస్ట్ వదిలింది ఫోర్బ్స్. వాటి ప్రాముఖ్యతకు దోహదం చేసినటువంటి కారణాల్ని కూడా వివరించింది. ఈ జాబితాలో కువైటీ దినార్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. అంటే ప్రపంచంలో బలమైన/ఖరీదైన కరెన్సీ ఇదే. కువైటీ దినార్ విలువ ఇండియన్ కరెన్సీలో రూ. 270.23 కు సమానం. ఇక 3.25 డాలర్లు అయితే ఒక కువైటీ దినార్.
ఇక ఈ జాబితాలో బహ్రెయినీ దినార్ రెండో స్థానంలో ఉంది. ఇది రూ. 220.4 కు సమానం. ఒమనీ రియాల్ మూడో ప్లేస్‌లో ఉంది. 2024 జనవరి 10 వరకు ఉన్న విలువల ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించింది ఫోర్బ్స్. ఇక ఈ జాబితాలో భారత దేశ కరెన్సీ అయిన ది ఇండియన్ రూపీ ఫోర్బ్స్ లిస్ట్‌లో 15వ స్థానంలో ఉంది. రూ. 82.9 అయితే ఒక డాలర్‌కు సమానం. ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం 180 దేశాల కరెన్సీల్ని చట్టబద్ధం చేసింది.
టాప్-10 కరెన్సీలివే..
కువైటీ దినార్- రూ. 270.23 or 3.25 డాలర్లు
బహ్రెయినీ దినార్ -రూ. 220.4 or 2.65 డాలర్లు
ఒమనీ రియాల్- రూ. 215.84 లేదా 2.60 డాలర్లు
జోర్డానియన్ దినార్- రూ.117.10 లేదా 1.141 డాలర్లు
జిబ్రాల్టర్ పౌండ్- రూ. 105.52 లేదా 1.27 డాలర్లు
బ్రిటీష్ పౌండ్- రూ. 105.52 లేదా 1.27 డాలర్లు
కేమన్ ఐలాండ్ డాలర్- రూ. 99.76 లేదా 1.20 డాలర్లు
స్విస్ ఫ్రాంక్- రూ. 97.54 లేదా 1.17 డాలర్స్
యూరో- రూ.90.80 లేదా 1.09 డాలర్లు
యూఎస్ డాలర్ - రూ.82.9
ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి అమెరికా కరెన్సీ యూఎస్ డాలర్ విస్తృతంగా వినియోగిస్తున్న కరెన్సీ అని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రాథమిక కరెన్సీ రిజర్వ్‌గా కూడా దీనివైపే అంతా మొగ్గుచూపుతున్నట్లు వివరించింది. 1960లో ప్రవేశపెట్టినప్పటి నుంచి కువైటీ దినార్ ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి కరెన్సీగా కొనసాగుతుంది. ఇక్కడ పన్ను రహిత వ్యవస్థ సహా చమురు నిక్షేపాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుండటమే దీనికి ప్రధాన కారణం. ఇక స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీ అని తెలిపింది ఫోర్బ్స్.
ఒక యూనిట్‌తో కొనుగోలు చేయగల/చేయదగిన వస్తువులు, సేవల సంఖ్య; మారకంతో వచ్చే విదేశీ కరెన్సీ మొత్తాన్ని మూల్యాంకనం చేయడం ద్వారా కరెన్సీ విలువ నిర్ధరించినట్లు ఫోర్బ్స్ వివరించింది. ఒక కరెన్సీ ప్రాముఖ్యత నిర్ణయించేందుకు సప్లై- డిమాండ్, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక వృద్ధి, కేంద్ర బ్యాంకుల విధానాలు, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని తెలిపింది.