తాజాగా వైసీపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో నందికొట్కూరు వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పేరు లేదు. నందికొట్కూరు (ఎస్సీ) నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆయన స్థానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్‌ను వైసీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఆర్థర్ కర్నూలులో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి.. తనకు సీటు తప్పకుండా ఇస్తామని హమీ ఇచ్చారని తెలిపారు. సజ్జలతో సమావేశమైనప్పుడు కూడా ‘సీఎం జగన్ గుండెల్లో నువ్వున్నావు.. అధైర్యపడాల్సిన అవసరం లేదు.. తప్పకుండా సీటు వస్తుంది’ అని హమీ ఇచ్చారన్నారు. ఐప్యాక్ సర్వేలో కూడా తనకే ఎక్కువ శాతం అనుకూలంగా వచ్చిందని, కానీ ఎందుకో తనకు టికెట్ దక్కలేదన్నారు. నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఒకే ఇన్‌చార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందంటూ ఆయన పరోక్షంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ నెల 21న కేఎస్‌ఆర్ పంక్షన్ హాలులో జరిగే కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఎమ్మెల్యే ఆర్థర్ వెల్లడించారు.