విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలో పోలీసు , ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతు నిర్వహించారు. శకటాల ప్రదర్శనను గవర్నర్ నజీర్, ఇతరులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.... ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలి. ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలి. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొంది,ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారు. స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి. గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారు. ఏపీ సంక్షేమ పాలనకు నా అభినందనలు. ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుంది అని అన్నారు .