మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదు.. ఒంటరిగానే పోటీ చేస్తామని వైయస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబులా బీజేపీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదన్నారు. మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని సీరియస్ కామెంట్స్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. విశాఖ రాజధాని కాకుండగా కేసులు వేసింది కూడా చంద్రబాబే. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు. పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారు. ఇప్పుడు షర్మిలను చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారు. వైయస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టింది. మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు సమాయత్తమవ్వాలని వైయస్ఆర్ సీపీ శ్రేణులకు సూచించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి అధిక స్థానాలు గెలిచే ప్రయత్నం చేయాలన్నారు. పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. తరగపువలస సమీపంలొ జరిగే వైయస్ఆర్‌సీపీ సభను మనం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.